Thursday, January 19, 2017

మాష్టారి ఇల్లు

మాష్టారిది  ఎత్తు   అరుగుల  ఇల్లు. మా  ఊళ్ళో  వుండే  ఒకే  ఒక  బ్రాహ్మణ  కుటుంబం  వారిది. ఆయన  పేరు  రామరావు గారు. మా  ఊళ్ళో ఆయన  అంటే  అందరికి  చాలా  ఇష్టం.  కారణం, ఎవరికి  ఏ  సాయం  కావలసి  వచ్చినా   అడగకుండా  చేసే వాళ్ళు  భార్య  భర్తలు. రామారావు గారు  చాల  మంచి  భావాలున్న  వ్యక్తి. ఊళ్ళో  కొందరికి  మాష్టారు  అంటే  ఇష్టం  లేకపోయినా, ఊళ్ళో  జనాల  కోసం  మౌనంగా   ఉండి  పోయేవాళ్ళు. 
                రోజూ  సాయంత్రం  స్కూల్  పిల్లలు  వాళ్ళింటి  ఎత్తు   అరుగుల  మీద  కూర్చొని చదువుకొనేవారు. "అక్కడికి వెళ్తే  మా  పిల్లలకి  నాలుగు  ముక్కలు  వొస్తాయి"  అనే  వాళ్ళు పెద్దవాళ్ళు, అంత  నమ్మకం  వాళ్ళకి. 
రోజూ  స్కూల్  అయిపోయాక   ఇంటికొచ్చి   పనులు  చూసుకొని  తన  ఈజీ  చైర్ లో  అరుగు దగ్గర  కూర్చునే   వారు. పక్కన  వారి  భార్య  శారద  గారు  ఏ  పువ్వులో  మాల  కడుతూ,  లేక  ఏవో బట్టల  మీద  డిజైన్స్   కుడుతూ  కనిపించేవారు. 
                వారికి  ఇద్దరు  పిల్లలు. రత్నాల్లాంటి  మాష్టారి  బిడ్డల్ని  చూసి  "బుద్ధి గా చదువు కొండిరా"  అంటూ  యేదో  మూల  ఎవరో  ఒక  పెద్ద  వాళ్ళు  అనడం  నేను  మా  ఊళ్ళో తరుచుగా  వినేవాణ్ణి .  మా  ఊళ్ళో  ఒకే  ఒక్క  రేడియో  ఉండేది  అప్పట్లో,   అదీ  మాష్టారి ఇంట్లో. సాయంత్రం  వొచ్చే   వార్తల  కోసం  అందరూ  అక్కడే  చేరుకొనే  వారు. ఊరి  పెద్దలకి కుర్చీలు  వేసేవాళ్ళు,  మిగిలిన  వాళ్ళు  కూర్చోడానికి  బెంచీలు  ఉండేవి.  ఎప్పుడు  ఎవరు కింద  కూర్చోడం  మాష్టారికి  నచ్చేది   కాదు.  
                 ఊళ్ళో ఏ  చిన్న  సమస్య   వచ్చినా   మాష్టారి  దగ్గరకి  కబురొచ్చేది.  గ్రామ  పెద్దలు 
కూడా   మాష్టారు గారిని  కూర్చోపెట్టి  నిర్ణయాలు  తీసుకునేవాళ్ళు. నేను  మాష్టారి  స్కూల్లోనే ఐదవ  తరగతి  వరకు  చదువుకున్నాను. పక్క ఊళ్ళో హైస్కూల్   లో  జాయిన్  అయితే  నన్ను అందరూ  టీచర్స్  చాలా  గొప్పగా  చూసేవాళ్ళు. 
"ఒరేయ్  రాము,  నువ్వు  చాలా  అదృష్టవంతుడివి రా. అలాంటి  మాష్టారు  చేతిలో  పడి చక్కగా చదువు  నేర్చుకున్నావు" అనే వాళ్ళు. నాకు  ఏమీ  అర్థం  అయ్యేది  కాదు. మాష్టారు  గారు  తన ఉద్యోగం  కదా  చేసుకుంటున్నారు  అనుకోనేవాణ్ణి. కానీ  తను  చేసే  దాన  ధర్మాలు  నాకు తెలీదు. వయసు  పెరుగుతూ  వుంటే  మాష్టారు  గారిని  అర్థం  చేసుకోవడం   మొదలు  పెట్టాను. నా  దృష్టిలో  తను  ఒక  నడిచివొచ్చే   ఒక  ఎన్సైక్లోపీడియా. 
నేను  టెన్త్  క్లాసు  ఫీజు  కట్టడానికి  డబ్బుల్లేక  ఇంట్లో  మౌనంగా  ఉండి  పోతే,  మాష్టారు  స్కూల్ కి వెళ్ళి  నా  ఫీజు  కట్టేసి, ఇంటికొచ్చి,  "ఒరేయ్  రాము,  స్కూల్  మానేయ్యకు. రేపటినుండి  వెళ్ళి బాగా  చదువుకొని  ఊరికి  మంచి  పేరు  తీసుకురావాలి"   అన్నారు. 
నేను  బాధగా, "మాష్టారూ, నాకు  చదువుకోవాలని  ఉందండి.  డబ్బుల్లేక  మా  నాన్న  చదువు మనేయ్యమన్నారు"  అన్నాను. 
"పర్వాలేదు   రాము, నేను  స్కూల్ లో  మాట్లాడాను. నువ్వెళ్ళి  చదువుకో"  అని  చెప్పి వెళ్ళిపోయారు. మర్నాడు  స్కూల్ కి  వెళ్తే  తెల్సింది  ఫీజు  మాష్టారు  కట్టేసారని. స్కూల్  నుండి  పరిగెత్తుకుంటూ  మాష్టారి  గారి  ఇంటికి  వెళ్ళాను.  
తను  నన్ను కూర్చోపెట్టుకొని, "రాము, నేను  నీకు  చేసిన  సహాయం  లాంటిది  నువ్వు  కూడా కొంతమందికి  ఎప్పుడో  ఒకప్పుడు  చెయ్యాలి. నీ  సహాయం  కోసం  అడగక  ముందే  వాళ్ళ అవసరం  గ్రహించి  చెయ్యాలి" అన్నారు.
                 సుమారు  ముప్పై  సంవత్సరాలు  గడిచిపోయాయి. రామరావు  గారు, వారి  ధర్మ  పత్ని  శారద  గారు  కాలం  చేసేసారు. వాళ్ళమ్మాయి  మాత్రం  విజయనగరం  దగ్గరలో  ఒక  ఊళ్ళో  అత్తవారింట్లో   ఉంటూ,  టీచర్ గా  చేసి, తండ్రికి  తగ్గ  కూతురిగా  పేరు  తెచ్చుకున్నారు. కానీ, విధి  వక్రీకరించి  ఆమె  కూడా  ఈ  మధ్య  కాలం  చేసారని   విని  నా  మనసు  బాధగా  మూల్గింది. వాళ్ళ  అబ్బాయి  కూడా  ఊళ్లోకి  రావడం  తగ్గించేసారు. తను  ఏం  జాబ్  చేస్తున్నారో  మాకు  తెలీదు. కార్  లో  వొచ్చి,  ఒకటో రెండో  రోజులుండి  వెళ్ళి  పోతారు. తనతో  మాట్లాడాలంటే  భయం, చనువు కూడా లేదు. 
                 ఇప్పుడు  మా  ఊళ్ళో  అన్ని  మేడలు, డబ్బా ఇళ్ళే. పూరిళ్ళు  లేవు,  అన్ని  ఇళ్ళకి  చుట్టూ  గోడలు, ఒకరికొకరికి  సంబధాలు  లేవు. ఊరిలో  కలిసి  జరుపుకొనే  పండగలూ  లేవు. గతంలో  అందరూ  రామాలయంకి  వెళ్ళే  వారు, ఇప్పుడేమో  రెండు  చర్చిలు  కూడా  వొచ్చేసాయి. ఊళ్ళో కి   ఆర్టిసి బస్సు  వొస్తోంది, చుట్టూ  ఫాక్టరీస్  ఒచ్చేసాయి, స్కూల్  లో  పిల్లలు  తగ్గిపోయి పనుల్లో కనిపిస్తున్నారు. ఇప్పుడు  మాష్టారి  ఎత్తు  అరుగుల  మీద  ఎలాంటి  సమావేశాలు  లేవు. ఎటువంటి  గొడవలు  వొచ్చినా, ఊళ్ళో  లాయర్  దగ్గరికి  వెళ్ళి   కోర్ట్ లో  కేసులు  వేసుకుంటున్నారు. 
                 చెప్పడం  మరిచిపోయా, మా  ఊరు   స్కూల్  పక్కన  దుర్గ  బార్  అండ్  రెస్టారెంట్   వొచ్చేసింది. ఉదయం  సాయంత్రం  నిత్యం  రద్దీగా  ఉంటోంది  అక్కడ. ఎవరో  నాలాంటి  వాళ్ళు  ఒకరిద్దరు  తప్ప  ఇంచుమించు  చాలామంది  అక్కడే  కనిపిస్తారు  మీకు. మాష్టారి  ఇంటిముందు  నుండి  వెళ్తూ  వుంటే  ఆ  ఎత్తు  అరుగులు  నన్ను  వెక్కిరిస్తున్నట్లు  కనిపించేవి. "ఈ  సారి  ఆ  బాబుతో  ఎలా  అయినా  మాట్లాడి  ఊరిని  బాగు  చెయ్యాలి  నాయన"  అన్నారు  మా  నాన్న గారు, ఆయన  ముసలి  కళ్ళలో  ఏదో  ఆశ. ఎలాగో  కష్టపడి  వారి  అడ్రస్  సంపాదించా. ఎక్కడో  దూర  ప్రాంతం లో  తను  కలెక్టర్  గా  చేస్తున్నారుట.  ఈ మధ్యనే  పెళ్ళి కూడా చేసుకుని అక్కడే స్థిర పడ్డారుట.  అయినా  నేను  నాన్న  కోసం  నా  పట్టుదలని  ఒదులుకోకుండా  బాబుగారికి  ఉత్తరం   రాసాను. తిరిగి  సమాధానం  వొస్తుందని  ఆశ  లేదు. అయినా  తప్పదు. ఎవరో  ఒకరు  ముందుకి  ఒక  అడుగు  వెయ్యాలిగా.
                 ఆశ్చర్యం ... సరిగ్గా  ఒక్క  వారంలో  బాబు  గారు  ఊరునుండి వచ్చారు. అయితే  ఈ సారి వారు  కార్  లో  రాలేదు. మామూలు  బట్టలతో  చిన్న  చేతి  సంచి  పట్టుకొని, భార్యతో  నడుస్తూ దూరంగా  కనిపించారు. నాకు  ఎందుకో  మాష్టారే  మళ్ళి  వొస్తున్నట్లనిపించి   "మాష్టరోచోరోచ్చారోచ్ "  అని  అరుచుకుంటూ  పరిగెత్తి  వెళ్ళాను. నా  అరుపులు  విన్న  కొందరు పెద్ద  వాళ్ళు  నా   వెంట  పరిగెత్తారు.  తిన్నగా  బాబు  దగ్గరికి  వెళ్ళి  చేతి  సంచి  అందుకొని, "బాబు,  కార్  ఏమయ్యింది?"  అని  అడిగాను. 
"చూడు  రాము, నువ్వు  నా  కళ్ళు  తెరిపించావు. మళ్ళి మన  ఊరిని  మనం  బాగు  చేసుకుందాం. రాము,  నువ్వు  నాతో   కలిసి  నడుస్తావా" అన్నారు. 
"అయ్యో  బాబుగారు,  తప్పకుండా"  అన్నాను. 
"ఇదిగో   రాము, వయసులో  నువ్వు  నాకంటే  పెద్ద  వాడివి.  'గారు'  అని  పిలిచి  నన్ను  వేరు  చేయకు. మనం  అందరం  ఒక్కటే. పద,  మీ ఇంటికి  వెళ్ళి  నాన్న గారిని  కూడా  సలహా  అడుగుదాం"  అన్నారు. 
"సాయంత్రం  అందరం  కూర్చొని  మాట్లాడుదాం"  అన్నాను.  
సాయంత్రం  ఎత్తరుగులు   మళ్ళి  కళకళలాడాయి.  చుట్టూ  ఆడా  మగా, మధ్యలో  బాబు. ఇప్పుడు  కుర్చీలు  లేవు. అందరం  చాపల  మీదే. 
"నేను  ఉద్యోగం  మానేసాను. మీలో  ఒకడిగా  నన్ను  ఆదరిస్తారని  రాము  మాటిచ్చాడు   నాకు." అన్నారు  బాబు. అందరూ  చాలా  సంతోష  పడిపోయారు.
                 ఇప్పుడు  ఒక  సంవత్సరం  అయ్యింది, బాబు  మా  ఊరొచ్చి. తను  స్కూల్ కి  వెళ్ళి  రోజూ  పాఠాలు   చెప్తున్నారు. స్కూల్ కి    మంచి  బిల్డింగ్  వొచ్చింది. స్కూల్  పక్కన  వున్న  దుర్గ  బార్  అండ్  రెస్టారంట్   పోయి  అక్కడ  కొత్తగా   ఒక  లైబ్రరీ  ఒచ్చింది. యూత్  అంతా  అక్కడే  కూర్చొని  పరీక్షలకి  చదువుకుంటున్నారు. ఇప్పుడు  పండగలు  పబ్బాలు  అందరం  కలిసే  మళ్ళి చేసుకుంటున్నాం. 
"ఈ  సారి  ఎలక్షన్స్  లో  బాబుని  సర్పంచ్ చేద్దాము"  అని అందరమూ ఆయనని   అడిగాము. బాబు మాత్రం ఆయనకి  ఏ పదవులు ఒద్దని చెప్పి నన్నే సర్పంచిని చేశారు.  
                 ఇప్పుడు  మా  ఊరు  నిండుగా  వుంది. అందరిది  ఒకటే  మాట, ఒక్కటే  బాట.  బాబు  గారి  భార్య,  కవలలకి  జన్మనిచ్చారు.  మాష్టారి ఇల్లు  కూడా  కళకళలాడుతూ  ఎంత  బావుందో. ఇప్పుడు అటు  వైపుగా  నడుస్తూ  మాష్టారి  ఇంటి  వైపు  చూస్తూ  వుంటే, ఇల్లు  నన్ను  చూసి  నవ్వుతున్నట్లు  అనిపిస్తోంది. 

Friday, September 23, 2016

Friendship

Friendship is knowing you have some one to count on
listen to your problems and complaints with out judging you
it is knowing that some one understands you and loves you
in a way, no one else can.
It means knowing there is someone who believes in your hopes and dreams
and encourages you to fulfill them,
friendship is sharing laughter
with a companion, a friend, that very special someone,
on whom you can always depend.
and when one has a friend like you
Friendship is for ever


Thursday, June 16, 2016

చిన్నమ్మ

నాన్నా ....
కన్నమ్మా ....
బుజ్జి నాన్నా....
బంగారు తండ్రీ....
ఎన్ని పేరులో ఎన్ని పిలుపులో
అయినా ఇంకా పిలవాలనే ఉంటుంది
మీ చిన్నమ్మ కి, ఏ కారణం లేకున్నా.

చిన్నమ్మ కి అమ్మవి అయ్యావు
చిన్నమ్మా అంటూ  బిడ్డ గా చెంత కి వచ్చావు
వరుసకేమో తమ్ముడివి
తండ్రి లా కంటి కి రెప్పలా కాపాడతావు
అమ్మా, నాన్నా, కొడుకు, తమ్ముడు, అన్ని వరసలు నువ్వే అయ్యావు

చిన్నమ్మ బాధపడితే నీ కంట నీరు వస్తుంది
చిన్నమ్మ కి దెబ్బ తగిలితే నీకు వాత మిగులుతుంది
చిన్నమ్మ మాట్లాడలేదని మనసు కష్టపెట్టుకున్నావు
కానీ, ఒక సారి చిన్నమ్మని ఆ క్షణం లో చూసావా
నీ కంట నీరు చుస్తే తను ఇంకా కుంగిపోతుంది
నీకు దెబ్బ తగిలినప్పుడు తన ప్రాణం విలవిలలాడుతుంది
నీతో మాట్లాడకపోతే తను ఉండగలదా కన్నా
పరిస్థితులు తెలిసిన నువ్వే తనని అర్థం చేసుకోకపోతే ఎలాగ  నాన్నా

నీ చిన్నమ్మ పేరాలు పేరాలు రాసేదన్నావు
ఇప్పుడు రాయటం మానేసిందని బాధ పడ్డావు
కారణం ప్రేమ తగ్గిపోయి కాదు
నీ గురించి ఎంత రాసినా తక్కువే కన్నా
మాటల్లో చెప్పుకోలేని ప్రేమ
పదాలే దొరకని ఆత్మీయం
ఎలా చెప్పాలో తెలియక
"కన్నమ్మా" అన్న పిలుపుతోనే ఆనందిస్తోంది
ఆ పిలుపులోనే తన ప్రాణం పెట్టుకుంది
చిన్నమ్మ నవ్వు లోని జీవం, నీ సంతోషంలో ఉంది నాన్నా.

Sunday, June 5, 2016

chinnu

                                                           
చిన్నూ

ఏడు నెలలు ఏడు రోజుల్లా  గడిచిపోయాయి
ఏడు నెలలు ఏం చేసాం , బ్లాగ్ లో కధలు , కవితలు
ఫోనులో కబుర్లు , వాట్స్ ప్ మెసేజెస్ , పేస్ బుక్ లో పోస్ట్ లు
నువ్వు రాసినవి బాగున్నాయి కన్నమ్మా! అంటావు నువ్వు
నవ్వుకుంటాను నేను .. ఎందుకో తెలుసా చిన్నమ్మా ?
నాకు రాయడం నేర్పించింది నువ్వే కదా మరీ !
నీకు రాత్రవు తుంది అంటే గుబులు నాకు ....
ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవాలి నీ నుండి ...
చిన్నమ్మా నా కధ రాయవూ! అని అడిగిన రోజు నాకు గుర్తుంది ..
నా కధ తెలియాలా లోకానికి ?ఇది ఒక రోజు నాకొచ్చిన అనుమానం
తెలియాలి అని కాదు చెప్పాలి .. ఇది నాకు నేను చెప్పుకున్న సమాధానం ...
నేనెవరో ఎక్కడి వాణ్ణొ !  నువ్వు తమ్ముణ్ణి చేసుకున్నావు
సొసైటీ లో ఎలా ఉండాలో నేర్పావు ...
నీ వెనుక నేను వున్నాను కన్నమ్మా ... అన్నావు .
అక్కవు .. అమ్మవు కూడా నువ్వే  చిన్నమ్మా  అంటే ..
సంతోషపడిపోయావు .. నేను బిజీ ఆఫీసు లో అంటాను ..
తినకుండా ఎదురుచూస్తావు .. చిన్నూ ! నీ కోసమే ..
పని ఆపుకొని ,, చిన్నమ్మా! డిన్నర్ ప్లేట్ లో పెట్టి తెచ్చుకో ! అంటాను ..
చిన్న పాపాయిలా సంతోష పడిపోతావు ..
నువ్వు తిను నాన్నా అంటావు ..  హహహ .. నేను తిన్నది
లోపల ఉండదమ్మా! నీ సంతోషం కోసం తింటున్నా !
ఎందుకంటే చిన్నమ్మా ! నువ్వు నాకు కావాలి .. ఎందుకో తెలుసా
నాకు అక్కవి ,, అమ్మవి  అన్నీ నువ్వే కదా చిన్నమ్మా !
నువ్వు రాసిన కధలు నాకిష్టం .. అందుకే నా  కధ నువ్వు రాయాలి ..
నాన్నా బయట ఎక్కువ సేపు తిరగకమ్మా అంటావు .. నవ్వొస్తుంది ..
నా ఉద్యోగం .. నాన్నా .. ఆరోగ్యం బాగులేదు కదరా !
ఉద్యోగం మానెయ్యి అన్నావు .. హహహ .. ఎలా మానెయ్యాలి .?
కమల వెళ్ళిపోయిన రోజు .. ఎంత ఏడ్చానో !
నాన్నా ! ఏడవకమ్మా అని  ఓదార్చావు ..
నా కష్టాలని నీ కష్టాలుగా భావించావు .. చిన్నూ !
ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను ?
 పిచ్చి రాత తోనా ? చిన్న పాట తోనా ?

నువ్వు నా ఊపిరివి
ఎందుకు   నా  జీవితం లో కి వచ్చావో తెలియదు నాన్నా
నువ్వొచ్చాకే జీవితాన్ని మళ్ళీ  ప్రేమించడం నేర్చుకున్నా
జీవితం లో మొదటి సారి మనసారా నవ్వాను

నిన్ను ఏడిపించినా, నువ్వు బాధపడి నన్ను నవ్వించావు
నీ ఇష్టాలన్నీ పక్కన పెట్టేసావు
నా కోసం తప్ప ఇంకా దేని కోసం ఆలోచించలేదు
చివరికి అందరిని వొదులుకోవడానికి సిద్ధపడ్డావు
అందుకే నువ్వంటే నాకు ఇష్టం నాన్నా
నాకోసం ఆలోచించే నువ్వు నాకు ప్రాణం నాన్నా

నీకు దూరంగా ఉండలేను....కానీ తప్పదు
ఇది జీవితం నాన్నా
నా మాటల్లో తప్పుంది  అనుకుంటే అనుకోనీ
నా మనసులో ఏముందో నాకు తెలుసు ....


                               .... మన  ఏడు నెలల పరిచయానికి  గుర్తుగా ... (గోపి)

Thursday, March 3, 2016

'కమలా' ల అశ్రు నివాళి

గుడ్ మార్నింగ్ నేను వచ్చేసా అంటూ పలకరింపులు
నేను నిన్ను డిస్టర్బ్ చేయను అంటూ అలకలు 
అంతలోనే   ష్...... ష్ అంటూ రహస్యాలు
గుర్తు పెట్టుకోవటానికి ఎన్నో జ్ఞాపకాలు 
మాకు ఇచ్చి నువ్వు వెళ్ళావు. 

అక్షరాలలోనే నీ రూపాన్ని చూసాను
వాటిలోనే నీ గొంతు విన్నాను
ఎదురుగానే కలుసుకుంటాను ఆన్నావు 
అప్పుడే నీ గొంతు వినమన్నావు 
కాని ఆ రూపం కనుమరుగయ్యింది
ఆ గొంతు మూగపోయింది.

తమ్ముడిని కలిసిన మొదటి రోజున
అమ్మ ని గుర్తు  చేసావుట
నీ రక్తాన్ని ఇచ్చి వాడిలో కలిసిపోయవు
స్నేహితురాలిగా వాడిని ఒదార్చావు
భార్యవి అయ్యి వాడికి తోడు అయ్యావు.

డబ్బు విలువ చెప్పావు
ధైర్యంగా ఉండటం నేర్పావు
వాడు బాధ పడితే నువ్వు ఏడ్చావు
ఒక్కడూ ఉండటానికి జాగ్రత్తలు చెప్పావు
పాపం అప్పుడు తెలియలేదు,
అవి అన్నీ జీవితాంతం గుర్తుపెట్టుకోవల్సినవని
నువ్వు వాడి కోసం పెట్టిన కన్నీరే
వాడికి మిగిల్చావని.

అమాయకురాలివనుకున్నాను
టింగరి  పిల్ల అంటూ ఏడిపించాను.
కానీ, చదువులో గోల్డ్ మెడలిస్ట్ వి అన్నారు
ఇంటి బాధ్యతలు తీసుకున్నావు
చెల్లెళ్ళు, మీ తమ్ముడి కోసం కష్టపడ్డావు
నాన్న కల నెరవేర్చాలని లెక్చరర్ వి అయ్యావు
అమ్మకి భయపడేదానివని తెలుసు
మళ్ళి అమ్మ తో కబుర్లు చెప్పనిదే నిదుర పోవు.
మరి నువ్వు లేని ఆ ఇల్లు ఈనాడు ఎంత శూన్యం అయ్యిందో.

నిన్ను ఆట పట్టించినందుకు
క్షమించమని అడగాలనుకున్నాను
అంతలో నే నువ్వు అనే మాట గుర్తు వచ్చి ఆగిపోయాను
"వదినా నువ్వు మా అమ్మ వే కదూ
అలా అని నన్ను బాధ పెట్టకూ" అంటూ

నువ్వు దూరం అయినా వాడు ఒంటరి అనుకోనీయలేదు
నీ కుటుంబంతో వాడిని కలిపావు
నీ బాధ్యతలు ఇప్పుడు వాడివి అని చెప్పావు.

అందరిలో మంచిని చూసావు 
నీకు కుదిరినంతలో ప్రతి వారికి సాయం చేద్దాం అనే అనుకున్నావు
అంత ఎందుకు అందరు నీ వాళ్ళనే అనుకున్నావు
నువ్వు గుర్తు వస్తే ఎన్ని కన్నీళ్ళో 
కానీ, అంతలోనే నీ మాటలు తలచుకుంటే అన్నే నవ్వులు 

కన్నయ్యా

కష్టం  వస్తే  కన్నీరు  లాగా  తోడుగా  ఉన్నావు
సంతోషంలో  నవ్వుల  పూవులే  పూయించావు
శత్రువులం  అయిపోయామా  అంటూనే  అక్క  మీద  ప్రేమని  చూపించావు
మాట్లాడుకోవద్దు అంటావు,  కానీ  కన్నా, ఉండగలవా  నువ్వు?

"ఇంకా" లు  "చెప్పు" ఇవీ  మన  కబుర్లు
అయినా  కుడా  గంటలు  గంటలు ఊసులు
కోపాలు, బాధపడటాలు
ఇంతలో   "సారీ" , " ప్లీజ్"  ల  తో  బుజ్జగింపులు
ఆ  కోపంలోను  ప్రేమే  కనిపిస్తుంది.
ఒకసారి  అన్నావు,
ఈ  మధ్య  కాలం  బాధ  పడిన  రోజులే  ఎక్కువని
కానీ, కన్నా ...బాధ  పడినవి  కొన్ని  క్షణాలు
ఆప్యాయంగా  మాటలు  చెప్పుకున్న  రోజులే  ఎక్కువ  కదూ.